సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28 : ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. రామ్‌నగర్ రామ్ మందిర్ వద్దనున్న జగ్గారెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన సభలో మెదక్ ఎంపీ సురేష్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు.
ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తోందన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని తెలిపారు. తెలంగాణలోనూ ఓటర్ల హక్కుల పరిరక్షణపై పార్టీ అప్రమత్తంగా ఉందన్నారు. నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని కోరారు. ఏళ్లుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్న వారికి కూడా నోటీసులు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, అర్హులైన వారి పేర్లు ఉన్నాయో లేదో కార్యకర్తలు పరిశీలించాలని పిలుపునిచ్చారు.

డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి బూత్‌లో ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని అన్నారు. అనంతరం సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్‌కు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ కంటెస్టెడ్ ఎంపీ నీలం మధు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి, సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





