- సివిల్ సప్లై, పోలీసుల సంయుక్త ఆపరేషన్
- అక్రమార్కులపై క్రిమినల్ కేసులు తప్పవు: జిల్లా సివిల్ సప్లై అధికారి పి. నిత్యానందం హెచ్చరిక
మెదక్, సెప్టెంబర్ 26 (ప్రజా నేస్తం ): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్ రీఫిల్లింగ్ గోదాంపై సివిల్ సప్లై మరియు పోలీసు అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా నిల్వ ఉంచిన 296 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా సివిల్ సప్లై అధికారి పి. నిత్యానందం ఆదేశాల మేరకు, అందిన విశ్వసనీయ సమాచారంతో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నర్సిములు, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి కాళ్లకల్ శివారులోని గోదాంపై ఆకస్మిక దాడి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమాదకర రీతిలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి, అక్కడున్న 296 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై అధికారి పి. నిత్యానందం మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం, అక్రమంగా సిలిండర్లను నిల్వ ఉంచడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల భారీ అగ్నిప్రమాదాలు జరిగి అమాయక ప్రజల ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెట్ దందా లేదా సిలిండర్ల అక్రమ విక్రయాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిస్తే స్థానిక అధికారులకు వెంటనే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







