ఆందోల్, సెప్టెంబర్ 25: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సాయిబాన్‌పేట గ్రామానికి చెందిన కుమారి సాయిప్రియ గౌడ్ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచింది. జ్యోతి – కృష్ణ గౌడ్ దంపతుల కుమార్తె అయిన సాయిప్రియ సిద్దిపేటలో నీట్ పరీక్ష రాయగా, విడుదలైన ఫలితాల్లో జాతీయ (ఆల్ ఇండియా) స్థాయిలో 590వ ర్యాంకు సాధించి సత్తా చాటింది.
సాధారణ పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాయిప్రియ గౌడ్‌తో పాటు ఆమె తల్లిదండ్రులను గ్రామ పంచాయతీ, ఉపాధ్యాయుల తరపున శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వాసరి మల్లేశం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో పుట్టి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి జాతీయ స్థాయిలో 590వ ర్యాంకు సాధించడం సాయిబాన్‌పేట గ్రామానికే గర్వకారణమని కొనియాడారు. విద్యార్థిని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కృషి అభినందనీయమని, భవిష్యత్తులో ఆమె వైద్యరంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
స్థానిక ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ఈ గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించి ఇంతటి ఘనవిజయం సాధించడం ఉపాధ్యాయులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గ్రామంలోని పిల్లల చదువుకు తల్లిదండ్రులు, పెద్దలు సహకారం అందిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఎందరో ప్రతిభావంతులను తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసరి మల్లేశం, మాజీ సర్పంచ్ మొగులయ్య, గ్రామ వార్డు సభ్యులు, రేషన్ డీలర్ పడమటి ప్రభాకర్, జెల్ల సాయిలు, కుమ్మరి నర్సింలు, బద్రి పోచయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని సాయిప్రియకు శుభాకాంక్షలు తెలిపారు.





