మెదక్, సెప్టెంబర్ 24 (ప్రజానేస్తం న్యూస్): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 23 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అధికారి, మెదక్ ఆర్డీవో డాక్టర్ రమాదేవి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలను ఆమె వెల్లడిస్తూ.. స్వీకరించిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) సెప్టెంబర్ 25వ తేదీన చేపట్టనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 26వ తేదీ వరకు గడువు ఉంటుందని, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం అక్టోబర్ 4వ తేదీన మేనేజింగ్ కమిటీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి రమాదేవి స్పష్టం చేశారు.






