మెదక్ ,సెప్టెంబర్ 22: ఆపదలో ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మెదక్ మండల పరిధిలోని గంగాపూర్, గంగాపూర్ తండాల్లోని బాధిత కుటుంబాలను మంగళవారం ఆయన స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు.
గంగాపూర్ గ్రామానికి చెందిన చెదల్ రాజు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడగా, వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అనంతరం గంగాపూర్ తండాకు చెందిన మూడవ గోపాల్ ఇటీవల మృతి చెందడంతో, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఓదార్చారు. రెండు బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు, తన వంతుగా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబాల పరామర్శ అనంతరం గంగాపూర్ గ్రామంలో గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతిష్టించిన గణనాథుడిని తిరుపతిరెడ్డి దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, యాదగౌడ్, కీసరి వెంకట్, సిద్యా నాయక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.







