దసరా పండుగ వేళ ఆందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో ఒక చక్కటి సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవలో ముందుకొచ్చారు. పండుగ సందర్భంగా గ్రామంలోని పెద్దమనుషులకు ఆమె స్వయంగా చీరలను పంపిణీ చేశారు.
గ్రామ మాజీ సర్పంచ్‌గా రవిశంకర్ ప్రజలకు అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకున్న దీవెన, పండుగ సంతోషాన్ని పెద్దలతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కానుకలను అందించారు. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరై, ఆమె అందజేసిన చిరు కానుకను ఎంతో ఆనందంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే తండ్రి సేవా గుణాన్ని అందిపుచ్చుకుని గ్రామంలోని వారిని గౌరవిస్తూ పండుగ కానుకలు అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. దీవెన భవిష్యత్తులో మరింత మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఆమె జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పెద్దమనుషులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








