16 కళారూపాలతో 4 వేల మందితో ఘనంగా ర్యాలీ
ప్రపంచానికి అన్నం పెట్టిన మెతుకు సీమ మెదక్: ఎంపీ రఘునందన్‌రావు
మెదక్, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలో ఆదివారం 16 కళారూపాలతో సుమారు 4 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ ఖిల్లాపై కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ ఖిల్లా సందర్శనార్థం టికెట్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఖిల్లా నుంచి వెస్లీ కళాశాల వరకు సాగిన ర్యాలీలో డప్పు, డోలు, తంబుర, చిందు, భాగవతం, బోనాలు, బతుకమ్మ, లంబాడీ, ఒగ్గు కళాకారులతో పాటు గీత కార్మికులు, కరాటే బృందాలు, ఎన్‌సీసీ విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో పాల్గొన్నారు. దీంతో మెదక్ సంస్కృతి, కళా వైభవం ప్రతిబింబించింది. అనంతరం వెస్లీ కళాశాలలో పర్యాటక రంగంపై రూపొందించిన ఏవీని ప్రదర్శించారు. శాంతికి సూచికగా ఎంపీ, కలెక్టర్, అదనపు ఎస్పీ, మున్సిపల్ చైర్‌పర్సన్ తెల్లటి పావురాలను ఎగురవేశారు. అనంతరం మెదక్ పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర మెతుకు సీమ మెదక్‌కు ఉందన్నారు. మెదక్ పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల వనదుర్గ, మెదక్ చర్చి తదితర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. మెదక్‌ను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు. పర్యాటక అభివృద్ధితో హోటళ్లు, టూరిస్ట్ గైడ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించి ప్రకృతిని కాపాడాలని సూచించారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంపద సమృద్ధిగా ఉందన్నారు. పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి కోసం 14 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. మెదక్ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. టూరిజం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
అదనపు ఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ చారిత్రక ప్రదేశాలు, వారసత్వ సంపదను భావితరాల కోసం కాపాడుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతిరాజు మాట్లాడుతూ మెదక్‌లోని వారసత్వ సంపద జిల్లా ప్రజల అదృష్టమన్నారు. పర్యాటకుల రాక పెరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో, జిల్లా టూరిజం అధికారి ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రామాదేవి, డీపీఆర్వో రామచంద్రరాజు, స్పోర్ట్స్ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, వివిధ శాఖల అధికారులు, కళాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








