– వెంటనే తొలగించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేత
పంట పొలాల సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే దానిని అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామ రైతులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పంట పొలాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డ్ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వెలువడే భరించలేని దుర్వాసన కారణంగా పొలం పనులకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తరచూ తగులబెడుతుండటంతో వెలువడే దట్టమైన పొగ వల్ల రైతులతో పాటు వ్యవసాయ కూలీలు శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే వర్షం కురిసినప్పుడల్లా డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే విషపూరితమైన మురుగునీరు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి చేరుతోందని, దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాపోయారు. వెలువడుతున్న దుర్వాసన కారణంగా పొలం పనులకు కూలీలు కూడా రావడం లేదని, దీనివల్ల సాగు పనులు పూర్తిగా స్తంభించిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పంట పొలాలకు, రైతుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించి, వ్యవసాయానికి ఆటంకం లేని అనువైన ప్రదేశానికి తరలించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు.







