అందోల్ ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను జోగిపేట పట్టణంలో మహిళలు, బాలికలు, ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేస్తూ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
జోగిపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో మహిళలు సామూహికంగా బతుకమ్మలను ఏర్పాటు చేసి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు.
అనంతరం బతుకమ్మలను సాగనంపేందుకు పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎంపల్లి చెట్ల వద్ద పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం పెద్ద చెరువు వద్ద మున్సిపల్ అధికారులు నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్‌కు మహిళలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ బతుకమ్మలకు పూజలు నిర్వహించి, పూల బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి వేడుకలను ముగించారు.
ఈసారి మున్సిపల్ అధికారులు నూతనంగా బతుకమ్మ ఘాట్‌ను నిర్మించడంతో మహిళలు, బాలికలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పట్టణంలోని వాడవాడలా బతుకమ్మ పాటలు, ఆటలతో పండుగ వాతావరణం నెలకొంది.






