నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలి.. పంటలను కాపాడాలి
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి రైతుల డిమాండ్
నారాయణఖేడ్ ప్రతినిధి : నిజాంపేట మండలం ర్యాలమడుగు విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు రోడ్డుపై నిరసన చేపట్టారు. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందడం లేదని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, రైతులు తమ పంటలకు నీరు అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
“పంటలు ఎండిపోతుంటే రైతుల బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?” అంటూ రైతులు ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే తీరుపై కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, రైతుల సమస్యలను ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

రైతులు మరింతగా మాట్లాడుతూ.. వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతుల ఆందోళన మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి. విద్యుత్ కోతలు, వోల్టేజ్ సమస్యలు, సరఫరాలో అంతరాయాలను వెంటనే పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలి అని బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.






