మెదక్, అక్టోబర్ 6: నశాముక్త భారత్, టీబీ ముక్త భారత్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. “జీవితానికి అవును.. నషాకు నో” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ ఐడీఓసీలో నిర్వహించిన నశాముక్త భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నశాముక్తి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమలో తాము మార్పు తెచ్చుకోవాలన్నారు. దేశాన్ని నశాముక్తంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసైతే దేశ అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.
ఇంటి నుంచే ఉద్యమం ప్రారంభం కావాలి
నశాముక్తి ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభమై పాఠశాల, గ్రామం, మండలం, జిల్లా స్థాయికి విస్తరించాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తిస్తే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంటనే స్పందించాలని సూచించారు. నశాముక్తి ఒక్కరి బాధ్యత కాదని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. 2029 నాటికి తెలంగాణను మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
నశాముక్త భారత్‌తో పాటు టీబీ ముక్త భారత్ లక్ష్య సాధనకు కూడా సమష్టిగా కృషి చేయాలని గవర్నర్ అన్నారు. టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధేనని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చన్నారు.
తెలంగాణ పోలీసులకు అభినందనలు
డ్రగ్స్ నిర్మూలన, ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే తొలి ట్రోఫీ సాధించడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. నశాముక్తి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల, గ్రామం, కుటుంబానికి తీసుకెళ్లాలని సూచించారు. మీడియా కూడా నశాముక్త తెలంగాణ, నశాముక్త భారత్ కోసం విస్తృతంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ నశాముక్త మెదక్, నశాముక్త తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అంతకుముందు గవర్నర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రామాదేవి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నశాముక్త్ భారత్ సెల్ఫీ పాయింట్ వద్ద గవర్నర్, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సెల్ఫీ దిగారు. మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు.
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.








