- సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ వద్ద ప్రమాదం
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన సూర్ణ భాను (25)
- ఆరు నెలల క్రితమే వివాహం.. కుటుంబంలో తీవ్ర విషాదం
నిజాంపేట్/సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ పరిధిలోని 161వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి వైపు నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సూర్ణ భాను (25) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, బంధువులు 108 అంబులెన్స్‌లో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ తెలిపారు.
మృతుడు భాను స్థానిక సూర్ణ బీరప్ప, నాగవ్వ దంపతుల కుమారుడు. భానుకు ఆరు నెలల క్రితమే జ్యోతి అనే యువతితో వివాహం జరిగినట్లు బంధువులు పేర్కొన్నారు. పెళ్లయిన కొద్ది నెలలకే చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం హోండా షైన్ (నెంబర్: TS 08 S 8875)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.






