ఫిబ్రవరి 15న కేంద్రం అధికారిక సెలవు ప్రకటించాలి
బొమ్మారెడ్డిగూడెంలో భవానీ మాత, సేవాలాల్ దీక్షాధారుల నిరసన
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు తండాల నుంచి తరలివచ్చిన గిరిజనులు
ఆందోల్ : దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం, బాల బ్రహ్మచారి శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని (ఫిబ్రవరి 15) కేంద్ర ప్రభుత్వం జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, అలాగే బంజారాల ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ సంత్ తపస్వి రామ్‌రావ్ మహారాజ్‌కు మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం అందజేయాలని బంజారా సమాజం డిమాండ్ చేసింది.
సోమవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెంలోని భవానీ మాత, సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో దీక్షా మహారాజ్‌లు, గిరిజన సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొమ్మారెడ్డిగూడెం, గొంగ్లూరు తండా, మిన్‌పూర్ తండా, లాల్సింగ్ నాయక్ తండా, హన్మ్యా నాయక్ తండా, సంగ్యా నాయక్ తండాలకు చెందిన భవానీ మాత, సేవాలాల్ మహారాజ్ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భారతదేశంలో విభిన్న కులాలు, మతాల గురువుల జయంతులకు ప్రభుత్వాలు అధికారిక సెలవులు ప్రకటిస్తున్నాయని, అయితే 29 రాష్ట్రాల్లో ప్రత్యేక భాష, సంస్కృతి, జీవన విధానం కలిగి ఉన్న బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతికి మాత్రం జాతీయ సెలవు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. హైందవ ధర్మ రక్షణ, మతమార్పిడుల నిరోధం, బంజారాల ఐక్యత కోసం జీవితాంతం కృషి చేసిన సేవాలాల్ మహారాజ్ చూపిన భక్తి మార్గం అనుసరణీయమని తెలిపారు.
అలాగే బంజారా సమాజం విద్యావంతులుగా మారేందుకు, తండాలలో ఆధ్యాత్మిక చైతన్యం తెచ్చేందుకు దేశవ్యాప్తంగా పర్యటించి దేవాలయాల నిర్మాణానికి కృషి చేసిన తపస్వి రామ్‌రావ్ మహారాజ్ సేవలను కొనియాడారు. 85 సంవత్సరాల పాటు కేవలం ఫలాహారంతోనే తపస్సు చేస్తూ శివైక్యం చెందిన ఆయన మహోన్నత త్యాగాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ‘భారతరత్న’ ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత గిరిజన సంక్షేమ అధికారి రామావత్ చంద్రకాంత్ మహారాజ్, పాండురంగం, దేవిదాస్ హెడ్మాస్టర్, ఈశ్వర్ నాయక్ పూజారి, దత్తు పూజారి, నగేష్ పూజారి, శంకర్ పూజారి, గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు, బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్ జైపాల్ నాయక్, గొంగ్లూరు తండా సర్పంచ్ సురేందర్, మాజీ కౌన్సిలర్ మోహన్‌లాల్, ఖుబ్య, చిల, శంకర్ నాయక్, రవీందర్ కార్బరి, దీక్షా మహారాజ్‌లు సురేందర్, రాజ్‌కుమార్, సంతోష్, శివ, జైల్‌సింగ్, గౌతమ్, శివాజీ, రాకేష్, విజయ్, అరవింద్, సురేష్, ప్రేమ్‌లాల్, బాబూలాల్, రమేష్, విశాల్, అభిలాష్, కార్తీక్, సేన, నవీన్, కిరణ్, ప్రకాష్, భువన్ తదితరులు పాల్గొన్నారు.





