44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళల హాకీ జట్టుకు స్వర్ణం.. ఒలింపిక్స్‌కు అర్హత
రింగులో భారత బాక్సర్ల హ్యాట్రిక్ పంచ్
ఆర్చరీలో పదిసార్లు ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాకు షాక్
ఆఖరి 40 సెకన్లలో అద్భుతం చేసిన రెజ్లర్ సుజిత్
మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి ఎగబాకిన భారత్
ఆసియా క్రీడల వేదికపై భారత క్రీడాకారులు పసిడి పండుగ చేసుకున్నారు. శుక్రవారం జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో నాలుగు స్వర్ణాలు మన మహిళా అథ్లెట్లే సాధించి సత్తా చాటడం విశేషం. దీంతో భారత్ ఖాతాలో 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో పతకాల సంఖ్య 76కు చేరింది. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
హాకీలో 44 ఏళ్ల స్వప్నం సాకారం!
నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు డిఫెండింగ్ చాంపియన్ చైనాను 1-0 తేడాతో చిత్తు చేసి ఆసియా చాంపియన్‌గా అవతరించింది.
- మ్యాచ్ హైలైట్స్: మ్యాచ్ 10వ నిమిషంలో లాల్‌రెమ్ సియామి నిర్ణయాత్మక గోల్ అందించింది. ఆ తర్వాత చివరి 50 నిమిషాల పాటు గోల్‌కీపర్ బిచూ దేవి, భారత డిఫెండర్లు గోడలా నిలిచి చైనా గోల్ చేయకుండా అడ్డుకున్నారు.
- చరిత్ర: 1982 న్యూఢిల్లీ ఆసియాడ్ తర్వాత భారత్‌కు మహిళల హాకీలో ఇదే తొలి స్వర్ణం. ఈ చారిత్రక విజయంతో భారత మహిళల జట్టు నేరుగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.(రవాణా సమస్యల వల్ల జట్లు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది).
సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వారి పోరాటపటిమ, పట్టుదల దేశ యువతకు, క్రీడాకారులందరికీ గొప్ప స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పంచ్ పవర్: బాక్సింగ్‌లో 3 స్వర్ణాలు
భారత బాక్సర్లు రింగులో ప్రత్యర్థులపై పిడుగుల్లాంటి పంచ్‌లతో విరుచుకుపడ్డారు.
లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు): తన 29వ పుట్టినరోజు నాడే ఏకపక్ష ఫైనల్లో 5-0తో చైనా బాక్సర్ ఝియి బావోను చిత్తు చేసి కెరీర్లో తొలి ఆసియాడ్ పసిడిని అందుకుంది.
- పర్వీన్ హుడా (65 కేజీలు): పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత చెన్ నీన్ (చైనీస్ తైపీ)పై 3-2తో హోరాహోరీ పోరులో గెలిచి స్వర్ణాన్ని ఒడిసిపట్టుకుంది.
- అంకుశ్ పంఘల్ (80 కేజీలు): దక్షిణ కొరియా బాక్సర్ మిన్సియాంగ్ కిమ్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 2018లో అమిత్ పంఘల్ తర్వాత ఆసియాడ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష బాక్సర్‌గా అంకుశ్ రికార్డుకెక్కాడు.
ఈ విజయాలతో భారత బాక్సింగ్ జట్టు ప్రస్తుత ఆసియాడ్ను 3 స్వర్ణాలు, 3 కాంస్యాలతో (ప్రియ, కపిల్ పొఖారియా, నరేందర్ బేర్వల్) మొత్తం 6 పతకాలతో ఘనంగా ముగించింది.
ఆర్చరీ: పదిసార్లు ఒలింపిక్ చాంపియన్లను మట్టికరిపించి..
మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భారత త్రయం అంకిత భకత్, కీర్తీశర్మ, కుంకుమ్ మొహోద్ చారిత్రక ఘనత సాధించారు. 10 సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా, గత ఆసియాడ్ విజేతగా ఉన్న బలమైన దక్షిణ కొరియా జట్టును ఫైనల్లో 5-3తో ఓడించి తొలిసారి ఈ విభాగంలో దేశానికి స్వర్ణాన్ని అందించారు.
అటు బెజవాడ కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర పురుషుల రికర్వ్ టీమ్‌తో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలోనూ అద్భుతంగా రాణించి భారత్‌కు రెండు రజతాలు అందించాడు.
40 సెకన్లలో అద్భుతం చేసిన సుజిత్ కల్కల్!
పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్ అసలైన థ్రిల్లర్‌గా నిలిచింది. తజకిస్థాన్ రెజ్లర్ అబ్దుల్‌మాజిద్ కుదియేవ్తో జరిగిన పోరులో చివరి 40 సెకన్ల వరకు సుజిత్ 2-9తో భారీ ఆధిక్యంలో వెనుకబడి ఉన్నాడు. ఓటమి తప్పదనుకున్న క్షణంలో సింహంలా విరుచుకుపడ్డ సుజిత్.. వరుస ‘టేక్‌డౌన్’లతో ఏకధాటిగా 8 పాయింట్లు సాధించి 10-9తో మ్యాచ్‌ను తిప్పికొట్టి అద్భుత స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు.
ఇతర పతకాలు
- సెయిలింగ్: మహిళల విభాగంలో నేత్రా కుమనన్ కాంస్యం సాధించింది.
- సెపక్తక్రా: పురుషుల జట్టు అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం గెలుచుకుంది.
నేటి ఆసియాడ్‌లో భారత కీలక మ్యాచ్‌లు (షెడ్యూల్)
| క్రీడ / ఈవెంట్ | పోటీదారులు / ఈవెంట్ వివరాలు | సమయం |
| క్రికెట్ (పురుషుల ఫైనల్) | భారత్ × పాకిస్థాన్ | ఉ. 10:30 |
| హాకీ (పురుషుల ఫైనల్) | భారత్ × మలేసియా | మ. 03:30 |
| ఆర్చరీ (వ్యక్తిగత రికర్వ్) | కుమ్కుమ్ (మహిళల క్వార్టర్స్), ధీరజ్, నీరజ్ (పురుషుల క్వార్టర్స్) | ఉ. 5:30 & ఉ. 9:30 |
| రెజ్లింగ్ (ఫ్రీస్టైల్) | దీపక్ పూనియా (97 కి.), సాగర్ (74 కి.), అమన్ (57 కి.), మనీషా (57 కి.), అంతిమ్ (53 కి.) | ఉ. 7:23 నుంచి |
| గోల్ఫ్ | అదితి అశోక్, ప్రణవి, దీక్షా, వీర్ అహ్లావత్, సాప్తక్, యువ్‌రాజ్ | ఉ. 3:30 నుంచి |
| రగ్బీ సెవెన్స్ | భారత్ × సింగపూర్ | ఉ. 06:20 |
| వాలీబాల్ | భారత్ × థాయ్‌లాండ్ | ఉ. 07:23 |







