బెల్లంపల్లి, అక్టోబర్ 7: సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు గత ఏడాది చెల్లించిన రూ.5 వేల లాభాల వాటాను ఈసారి పెంచి చెల్లించాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం, కుటుంబ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని న్యాయమైన లాభాల వాటా ఇవ్వాలని కోరారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణా, గనుల నిర్వహణలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ కీలకమని, సంస్థ లాభాల్లో వారికి తగిన వాటా కల్పించాలని నాయకులు పేర్కొన్నారు.
గత ఏడాది రూ.5 వేలే చెల్లించారనే కారణంతో ఈసారి కూడా అదే మొత్తాన్ని కొనసాగించకుండా, ధరల పెరుగుదలకు అనుగుణంగా లాభాల వాటాను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ. మణిరామ్ సింగ్, సింగరేణి గని కార్మిక సంఘం (SGKS) రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్, AIFTU రాష్ట్ర కార్యదర్శి ఎం. పోషమల్లు, కాంట్రాక్టు కార్మికులు లక్ష్మి, కృష్ణవేణి, రాధా తదితరులు పాల్గొన్నారు.







