టేక్మాల్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మెదక్ జిల్లా లేబర్ సెల్ కన్వీనర్‌గా టేక్మాల్ మండలానికి చెందిన నాయికోటి శ్యామయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. నాయికోటి శ్యామయ్య మొదటి నుంచి పార్టీ పట్ల చూపుతున్న అంకితభావం, నిబద్ధతను గుర్తించి అధిష్టానం ఈ కీలక బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు. జిల్లా లేబర్ సెల్ కన్వీనర్‌గా జిల్లాలోని కార్మిక వర్గాల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్మిక సంక్షేమ పథకాలను, బీజేపీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, కార్మికుల న్యాయమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా పోరాడాలని సూచించారు.
అలాగే టేక్మాల్ మండలంలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. నూతన కన్వీనర్‌గా నియమితులైన శ్యామయ్య తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధిరాములు, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎల్లుపేట రాజు, వడ్డె రాములు, గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు మోహన్, బీజేవైఎం మాజీ కార్యదర్శి మదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సేనాపతి, ఉపాధ్యక్షులు నాగరాజు, వినోద్, బూత్ అధ్యక్షులు నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






