లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సాంస్కృతిక కళ్యాణ వేదిక భవనాన్ని (ఫంక్షన్ హాల్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ కాలనీవాసులతో పాటు పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఈ భవనం సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన చేతుల మీదుగా నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఎజాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నార్ల రవీందర్, నార్ల సురేష్, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ టౌన్ మైనారిటీ సెక్రటరీ ఎండీ దావూద్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎమ్మార్వో రాజా నరేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.







