సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగమే తన వ్యవసాయ భూమి వద్దకు కాంగ్రెస్ ఎంపీల పర్యటన అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. దొంగతనం చేసిన దొంగే.. ఎదురు ‘దొంగ దొంగ’ అని అరిచినట్లుగా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి ఉందని ఆయన విమర్శించారు.
22A తో లక్షలాది మందికి నరకం:
రాష్ట్రంలో ఏకంగా 30 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సమయం తక్కువగా ఉండటంతోనే కలెక్టర్లు హడావిడిగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీలో ఒప్పుకున్నారని గుర్తుచేశారు. రైతుబంధు రాక, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం భూములు అమ్ముకోలేక ప్రజలు గోసపడుతుంటే, ఆ సమస్యలను లేవనెత్తినందుకే తమపై కక్షగట్టి ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ బండారం బయటపడుతుందనే దురుద్దేశంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆక్షేపించారు.
నా భూమిలో విలాసాలు లేవు.. కనీసం బాత్రూం కూడా లేదు:

తన వ్యవసాయ భూమిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. “నా భూమిలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదు, కనీసం ఒక బాత్రూం కూడా లేదు. 2018 నుంచి 2024 వరకు విడతల వారీగా కొనుగోలు చేసిన 13 ఎకరాల 12 గుంటల భూమికి సంబంధించి అన్ని అధికారిక డాక్యుమెంట్లు ఉన్నాయి. అధికారులతో సర్వే చేయిస్తే నా ఆధీనంలో 2 గుంటలు తక్కువే ఉన్నట్లు తేలింది. నా భూమిలో ఒక్క చిన్న తప్పు ఉందని నిరూపించినా మొత్తం 13 ఎకరాల భూమిని ప్రభుత్వానికే రాసిచ్చేస్తా” అని స్పష్టం చేశారు.
ఎంపీలకు అభివృద్ధిని చూపిద్దామనుకున్నా:
సిద్దిపేటకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీల బృందానికి అతిథి మర్యాదలు చేసి, తన వ్యవసాయ భూమితో పాటు నిలిచిపోయిన అభివృద్ధి పనులను చూపిద్దామనుకున్నానని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో 90 శాతం పూర్తయిన 1000 పడకల ఆసుపత్రి మిగిలిన పనులు, నిలిచిపోయిన నర్సింగ్ కాలేజీ, రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టు, ఎండిపోతున్న పంటలు, రుణమాఫీ కాని రైతుల గోడును వారికి చూపిద్దామని భావించానన్నారు. అధికారం చేతిలో ఉన్న ప్రభుత్వం నివేదిక తెప్పించుకోకుండా వేలమంది పోలీసులతో యుద్ధానికి వచ్చినట్లు సిద్దిపేటపై పడటం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై దండయాత్ర చేయండి:
రాజకీయ కక్షసాధింపు యాత్రలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై దండయాత్ర చేయాలని హరీశ్ రావు హితవు పలికారు. కేసీఆర్ హయాంలో సాధించిన 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే, ఏపీ అక్రమంగా గోదావరి నీళ్లను తరలిస్తుంటే ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్, పాలమూరు-రంగారెడ్డి, మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం పోరాడాలని డిమాండ్ చేశారు.
రాజీనామాలకు సిద్ధమా?
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ 300 ఎకరాల దళితుల భూమిని కబ్జా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారని, ఒకవేళ కేసీఆర్ వద్ద ఎలాంటి దళితుల భూమి లేదని తేలితే సీఎం రేవంత్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమా అని హరీశ్ రావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.






