🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు పాలన సాగిస్తున్నారు: రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కరీంనగర్ | 🗓 03 Oct 2026 | ⏰ 12:50 AM

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, బీఆర్‌‌ఎస్‌ నాయకులపై కక్ష సాధింపే ఏకైక లక్ష్యంగా పోలీస్‌ రాజ్యం నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కొప్పుల ఈశ్వర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తూ పూర్తిగా అబద్ధాలతో పరిపాలన సాగిస్తోందని మండిపడ్డారు.

కేవలం కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలనను గాలికొదిలేసి కేవలం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు, రాజకీయ ఆరోపణలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను పక్కనపెట్టి, హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు, వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

చేనేత సంక్షేమాన్ని విస్మరించిన ప్రజాపాలన

గత కేసీఆర్ ప్రభుత్వంలో చేనేత, జౌళి రంగానికి పెద్దపీట వేశారని కొప్పుల గుర్తుచేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, నిరంతర సబ్సిడీలు, నేతన్నకు భరోసా, నేతన్న బీమా వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని వేలాది మంది కార్మికులను ఆర్థికంగా ఆదుకున్న ఘనత బీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగి సిరిసిల్ల ప్రాంతం ‘ఉరిసిల్ల’గా మారిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బతుకమ్మ చీరలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లను నేరుగా సిరిసిల్ల పవర్‌లూమ్ కార్మికులకే అందించి వేల కోట్ల రూపాయల ఉపాధి కల్పించామని పేర్కొన్నారు.

ప్రకటనలకే పరిమితమైన గల్ఫ్ పాలసీ

గల్ఫ్ కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని, కానీ క్షేత్రస్థాయిలో ఆ హామీ కేవలం ప్రకటనలకే పరిమితమైందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గల్ఫ్ బాధితులకు ఎలాంటి ఆర్థిక రక్షణ కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చరిత్ర కలిగిన రేవంత్‌రెడ్డికి నిజాయితీ, విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమమే లేకపోతే రేవంత్‌రెడ్డికి రాజకీయంగా అసలు గుర్తింపు ఎక్కడిదని ఆయన నిలదీశారు.

ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, నగర మాజీ మేయర్‌ సర్దార్‌‌ రవీందర్‌సింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, మాజీ జడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జయశ్రీ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్