మెదక్ ప్రతినిధి : వాతావరణ మార్పులు మరియు రానున్న కాలంలో ఎదురయ్యే సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతాంగం అప్రమత్తం కావాలని మెదక్ మండల వ్యవసాయ అధికారి (ఏవో) శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భూగర్భ జలాల అపరిమిత వాడకాన్ని తగ్గించి, అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు రైతులు సాంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని స్పష్టం చేశారు. మెదక్ మండల కేంద్రంలో స్థానిక విత్తన డీలర్లు, పురుగుమందుల విక్రేతలకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. వరి పంటకు విపరీతంగా నీరు అవసరమవుతుందని, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, మినుములు, పెసలు, శనగలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా అటు నీటిని ఆదా చేయవచ్చని, ఇటు మంచి మార్కెట్ ధరను పొంది ఆర్థికంగా లాభపడవచ్చని రైతులకు వివరించారు. ఈ విషయమై విత్తనాల కొనుగోలుకు వచ్చే రైతులకు విత్తన డీలర్లు కూడా సరైన అవగాహన కల్పించాలని కోరారు.
ఆరుతడి పంటలు మరియు కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా విశేష రాయితీలను అందిస్తోందని ఆయన తెలిపారు. రైతులు తమ పొలాల్లో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సేద్య పరికరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, అర్హులైన రైతులు సంబంధిత వ్యవసాయ, ఉద్యానవన అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సూక్ష్మ సేద్యం వల్ల మొక్కల వేర్లకు నేరుగా నీరు, పోషకాలు అంది కలుపు సమస్య తగ్గి, నాణ్యమైన పంట దిగుబడి సాధ్యమవుతుందని వివరించారు.
రైతులు దుకాణాలకు వచ్చినప్పుడు ఏ నేలకు ఏ విత్తనాలు అనుకూలం, ఎరువుల సమతుల్య వినియోగం తదితర అంశాలపై సాంకేతిక సమాచారాన్ని అందించాలని విత్తన డీలర్లకు దిశానిర్దేశం చేశారు. నిషేధిత విత్తనాలు, నకిలీ ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) ప్రశాంత్, ప్రముఖ విత్తన డీలర్లు కృష్ణారెడ్డి, సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.








