మెదక్, సెప్టెంబర్ 26: ప్రపంచంలోనే అత్యంత అరుదైన పథకం సీఎం బ్రేక్‌ఫాస్ట్ అని ఉపాధి, కార్మిక, గనుల భూగర్భ శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని మార్కెట్‌యార్డులో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత కిచెన్‌ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి ప్రారంభించారు. కిచెన్‌లోని యంత్రాలను పరిశీలించిన మంత్రి వాటి పనితీరు, సామర్థ్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అల్పాహారం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడమే పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రీకృత కిచెన్లు ఏర్పాటు చేసి, సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. పాఠశాలలకు ఉదయం 8.30 గంటలకే అల్పాహారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ బృందానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

మెదక్‌లో వచ్చే ఏడాది నుంచి 2,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో యంగ్ ఇండియా స్కూల్‌ను ప్రారంభిస్తామని, రూ.100 కోట్లతో పబ్లిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 10 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేశామని చెప్పారు. సాంకేతిక శిక్షణ కోసం ఏటీసీ సెంటర్‌ను ప్రారంభించామని, శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తూ విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మెదక్‌లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షుడు హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్రదాస మాట్లాడుతూ మెదక్ జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. కొడంగల్‌లో ప్రారంభించిన కేంద్రీకృత కిచెన్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. మెదక్‌లో కిచెన్ షెడ్‌ను 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, హెచ్‌కెఎంసీఎఫ్ సీఈఓ కౌంతేయదాస ప్రభుజీ, పీఆర్ ఇన్‌చార్జి రవిలోచనదాస ప్రభుజీ, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.







