నారాయణ ఖేడ్ ప్రతినిధి : కల్హేర్ మండలంలోని రోడ్ల దుస్థితి, నల్లవాగు నీటి సమస్య, విద్యుత్ కష్టాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట పాదయాత్ర నిర్వహించారు. మాసాన్‌పల్లి రోడ్డు నుంచి కల్హేర్ వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే పాదయాత్ర చేపట్టినట్లు భూపాల్ రెడ్డి తెలిపారు.
రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నల్లవాగు నీటిని సక్రమంగా వినియోగిస్తే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహా రెడ్డి, మాసాన్ పల్లి సర్పంచ్ కుర్మ సాయిలు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్లు, బీఆర్ఎస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






