ఎట్టకేలకు పట్టుబడిన వేటగాళ్ళు.
పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా చేదించిన కృష్ణజింక కేసు.
వివరాలు వెల్లడించిన డీసీపీ శిరీష రాఘవేంద్ర.
రంగారెడ్డి జిల్లా,సెప్టెంబర్ 28: ఎట్టకేలకు కృష్ణజింక కేసును చేదించారు. సోమవారం సాయంత్రం కృష్ణజింక మాంసం తరలిస్తున్న వేటగాళ్ల కేసును షాద్ నగర్ డిసిపీ శిరీష రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా చేదించారని డిసిపీ మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.కృష్ణజింకను వేటాడి, దాని మాంసాన్ని ముక్కలుగా నరికి నగరానికి తరలిస్తున్న తొమ్మిది మంది ముఠాను రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైసెన్స్‌డ్ తుపాకీ, బుల్లెట్లు, కృష్ణజింక మాంసం, రెండు వాహనాలు, నగదు, సెల్‌ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ శిరీష రాఘవేంద్ర వివరాలు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 26న అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు కార్లలో నారాయణపేట జిల్లా మరికల్ అటవీ ప్రాంతానికి వెళ్లారు.సెప్టెంబర్ 27న ఉదయం లైసెన్స్‌డ్ తుపాకీతో కృష్ణజింకను వేటాడి చంపిన అనంతరం దాని మాంసాన్ని ముక్కలుగా నరికి ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వైపు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాయకల్ టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా నిందితుల ముఠా పట్టుబడింది. విచారణలో కృష్ణజింకను తామే వేటాడినట్లు నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎం.డి. హాజీ ఉద్దీన్ (36), మీర్ ముక్తార్ అలీ (37), ఎం.డి. తాజుముల్ (37), మీర్ రాజా అలీ ఖాన్ (39), ఖుర్రం ఖాన్ (35), సయ్యద్ సల్మాన్ అలీ (30), ఎం.డి. అఫ్రోజ్ ఖాన్ (36), ఎం.డి. అబ్దుల్ అజీజ్ (33), ఎం.డి. రియాజ్ (28) ఉన్నారు. నిందితుల నుంచి .315 రైఫిల్, టెలిస్కోప్, సైలెన్సర్, 19 బుల్లెట్లు, సుమారు 13 కిలోల కృష్ణజింక మాంసం, నల్లటి స్కార్పియో వాహనం, సుజుకి ఎస్-క్రాస్ వాహనం, ఎనిమిది స్మార్ట్‌ఫోన్లు, రూ.28,590 నగదు, రెండు టార్చ్‌లైట్లు, క్యానన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని 9, 39, 50, 51, 57 సెక్షన్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 30 కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని అక్రమంగా తరలించడం లేదా విక్రయించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని డీసీపీ శిరీష రాఘవేంద్ర హెచ్చరించారు.అక్రమ వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.వన్యప్రాణుల అక్రమ వేటకు సంబంధించిన సమాచారం తెలిస్తే అటవీశాఖ టోల్‌ఫ్రీ నంబర్లు 1800-425-5364, 040-23231440కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ మీడియా సమావేశంలో , పట్టణ సీఐ సీతారాం, ఎస్‌వోటీ పోలీసులు, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







