నారాయణఖేడ్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) నారాయణఖేడ్ డివిజన్ నూతన కార్యవర్గ సభ్యులకు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు ఎం. భూపాల్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలోని భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో నిత్యం జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని కొనియాడారు. ప్రజా సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిరంతరం వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వారి గౌరవాన్ని కాపాడామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూతన కార్యవర్గం జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మునిగాల మాణిక్ ప్రభు, డివిజన్ అధ్యక్షుడు పుట్టి సంజీవ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి యం.ఏ. ఖైసర్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సిద్ధారాం, కోశాధికారి ఇబ్రహీం, సహాయ కార్యదర్శులు డానియల్, నాగ్ శెట్టి, మోహన్ రాథోడ్, ఈసీ సభ్యులు ప్రశాంత్, చోటు, ప్రవీణ్ పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, పండరి, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ శెట్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మాజీ సర్పంచులు సంగప్ప, రాజు నాయక్, నాయకులు మిట్టు, శ్రీనివాస్ రెడ్డి, చింటూ నరేష్, ప్రశాంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.






