మెదక్ : పోలీస్ శాఖలో 37 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన హవేలీఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణకు జిల్లా పోలీస్ శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆయనను ఘనంగా సన్మానించారు. 1989లో ఉమ్మడి మెదక్ జిల్లాకు కానిస్టేబుల్‌గా ఎంపికైన సత్యనారాయణ పోలీస్ శాఖలో అంచెలంచెలుగా ఎదిగి ఎస్ఐగా పదోన్నతి పొందారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో విశేషంగా కృషి చేశారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి సహచరులు, ప్రజల నుంచి మంచి పేరు సంపాదించారని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు సేవలందించిన సత్యనారాయణ సేవలు అభినందనీయమన్నారు. ఉద్యోగ విరమణ అనేది సేవలకు ముగింపు కాదని, ఇకపై కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ అనంతరం కూడా పోలీస్ శాఖతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం సత్యనారాయణతో పాటు ఆయన సతీమణిని ఎస్పీ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, సీఐలు జార్జ్, రాజశేఖర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






