మెదక్, సెప్టెంబర్ 27: స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ అన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, బీఆర్‌ఎస్ నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాడారని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన గొప్ప తెలంగాణవాది అని కొనియాడారు. చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం ఉద్యమించిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఆయన ప్రజాసేవకు దక్కిన గౌరవానికి నిదర్శనమన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, బీమారి కిషోర్, ఆర్కే శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, లింగా రెడ్డి, బొద్దుల కృష్ణ, పద్మశాలి సంఘం నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







