🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రైతులు సాంకేతిక పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 26 Sep 2026 | ⏰ 06:38 PM
  • మెదక్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ‘కిసాన్ మేళా’
  • రైతుల పక్షపాతి ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, సెప్టెంబర్ 26: రైతులు సంప్రదాయ సాగుకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని కార్మిక, గనుల మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం మెదక్ పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, యాంత్రీకరణ, అధిక దిగుబడుల సాధనపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ‘కిసాన్ మేళా’ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూతన సాగు విధానాలను అలవర్చుకోవాలని, పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి రైతు వినియోగించుకోవాలని తెలిపారు.

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షపాతి అని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అనేక అనుకూల విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆధునిక యంత్రాలు, సాంకేతికతను జోడించి వ్యవసాయం చేస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు.

రైతులు సాంకేతిక పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలి మంత్రి వివేక్ వెంకటస్వామి

ఈ మేళాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, బిందు/తుంపర సేద్యం ద్వారా నీటి పొదుపు పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. వివిధ వ్యవసాయ అనుబంధ శాఖలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), విత్తనాలు, ఎరువులు, యంత్రాల తయారీ సంస్థల ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఏడీ శ్రీధర్ రాజశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు సతీష్, సాంబాజి దత్తాత్రేయ నాల్కర్, ప్రొఫెసర్ నిర్మల, రాఘవేంద్ర, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్