ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్
మెదక్ ప్రతినిధి అక్టోబర్ 18 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను పట్టణంలో అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని నవాబ్‌పేట ప్రాంతంలో బతుకమ్మ వేడుకల కోసం చేపడుతున్న వివిధ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెద్ద పండుగ అయిన సద్దుల బతుకమ్మ వేళ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మలు ఆడే ప్రాంగణాలు, నిమజ్జన ప్రాంతాల వద్ద పారిశుధ్య పనులను వేగవంతం చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, తగినంత లైటింగ్ వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఉత్సవాలు ప్రశాంతంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగేలా మున్సిపల్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక వార్డు ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.








