రంగారెడ్డి జిల్లా పడకల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఎల్-నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభ జరిగింది. రాబోయే కాలంలో నీటి ఎద్దడి రాకుండా చేతిపంపుల మరమ్మతులు, పైప్‌లైన్ లీకేజీల నివారణ, ఇంకుడు గుంతలు, వ్యవసాయ కుంటల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామ పంచాయతీ పరిధిలోని చేతిపంపులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, పైప్‌లైన్ లీకేజీలను యుద్ధప్రాతిపదికన అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతుల వ్యవసాయ భూముల్లో వ్యవసాయ కుంటలు, మ్యాజిక్ సోక్ పిట్లు, సామాజిక సోక్ పిట్లు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు తోడ్పడాలని కోరారు.
నీటి లభ్యత తక్కువగా ఉండే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు, చిరుధాన్యాలు (మిల్లెట్స్) సాగు చేయాలని వ్యవసాయ అధికారులు వివరించారు. అలాగే విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. వేసవి, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పశువుల కోసం ముందస్తుగానే పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవాలని, మూగజీవాలకు నిరంతరం నీటి వసతి కల్పించాలని రైతులకు సూచించారు. “ఎల్-నినో సవాళ్లను అధిగమించడానికి సమష్టి భాగస్వామ్యం, ముందస్తు ప్రణాళికే ఏకైక మార్గం” అని సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారిణి రేణుక చౌదరి, గ్రామ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది, మహిళా సమాఖ్య ప్రతినిధులు, గ్రామ యువకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








