రంగారెడ్డి జిల్లా : షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం సంగెం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి పండాల్ భక్తులతో సందడిగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కేశంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ దుర్గాదేవి పండాల్ను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.అనంతరం జవాజీ శాంతమ్మ, నాగభూషణం గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.





