జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు శనివారం గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో ‘జాతీయ పోషణ మాసం’ పురస్కరించుకుని న్యూట్రిషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోషకాహార ప్రాముఖ్యతను చాటిచెప్పే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రదర్శన స్థానికులను, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద, స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలతో (మిల్లెట్స్) తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు అందించే విభిన్న రకాల ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తాము తెచ్చిన వంటకాల పోషక విలువల గురించి సందర్శకులకు వివరించారు. ఈ ప్రదర్శనను స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) పి. సుజాత మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరికీ పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే జాతీయ పోషణ మాసం ముఖ్య ఉద్దేశం. ఖరీదైన ఆహారంలోనే బలం ఉంటుందనే భావన సరికాదు. మన చుట్టూ సులభంగా లభించే ఆకుకూరలు, కూరగాయల్లోనే శరీరానికి అవసరమైన అత్యధిక పోషకాలు ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్యమైన, సహజసిద్ధమైన ఆహారం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి” అని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మమత మాట్లాడుతూ, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పిల్లలు స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం వల్ల చిన్నతనం నుంచే వారిలో పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల స్పష్టమైన అవగాహన పెరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో పోషకాహార ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు ఇప్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరితో కలిసి ‘పోషణ ప్రతిజ్ఞ’ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది జరీనా, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






