సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేటలో శిక్షణ తరగతులు
ప్రారంభించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, ప్రతినిధి : పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు చేయూత అందించేందుకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు.
సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ తదితర అంశాల్లో నిపుణులతో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సమయపాలన పాటిస్తూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించి, పోలీసు ఉద్యోగాల సాధనలో తోడ్పడేందుకు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు పట్టుదలతో చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఆర్డీఓ రాజన్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





