రంగారెడ్డి జిల్లా (ప్రజా నేస్తం డిజిటల్ న్యూస్), అక్టోబర్ 08: దేశాన్ని క్షయ (టీబీ) రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో సరికొత్త ముందడుగు పడింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘జోష్’ (JOSH – Join Our Support to End TB) టీమ్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అధ్యక్షతన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. దేశంలో టీబీ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయని, ఈ మహత్కార్యంలో జోష్ టీమ్ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. సమాజంలో క్షయ వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడంలో యువత, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
గ్రామ, వార్డు స్థాయిల్లో పర్యటించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానితులను సకాలంలో గుర్తించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHC) తీసుకురావాలని సూచించారు. సరైన సమయంలో గుర్తిస్తే టీబీని పూర్తిగా నయం చేయవచ్చని, బాధితులకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన చికిత్స, మందులు అందిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి (DPO), జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), జిల్లా టీబీ నియంత్రణ విభాగ అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు జోష్ టీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






