హుజూర్నగర్: త్వరలో జరగనున్న నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మహమ్మద్ మన్సూర్ అలీ పిలుపునిచ్చారు. శనివారం హుజూర్‌నగర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫారం-18 నూతన ఓటు హక్కు దరఖాస్తు పత్రాలను డివిజనల్ ఎన్నికల అధికారి (ఆర్డీవో) శ్రీనివాసులుకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా మన్సూర్ అలీ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి అర్హత కలిగిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఫారం-18 దరఖాస్తును పూర్తి చేసి ఆన్లైన్ ద్వారా గానీ, లేదా ఆఫ్‌లైన్‌లో సంబంధిత తహసీల్దార్ లేదా ఆర్డీవో కార్యాలయాల్లో నవంబర్ 6వ తేదీ లోపు అందజేయాలని స్పష్టం చేశారు.





