టేక్మాల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలోని చారిత్రక శ్రీ తుంబురేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ ఉత్సవాలకు విశేష స్పందన లభించింది.
స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్రలో గ్రామ మహిళలు, వెలుగు సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు బతుకమ్మలు, బోనాలను నెత్తినెత్తుకుని డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, నృత్యాల నడుమ ఆలయం వరకు ఊరేగింపుగా కదిలారు. అనంతరం ఆలయంలో ప్రధాన అర్చకులు అరుణ్ శర్మ, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి శాస్త్రోక్తంగా పూలాభిషేకం, మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి చారిత్రక, శిల్పకళా సంపద కలిగిన వేల్పుగొండ క్షేత్రానికి పర్యాటక రంగంలో ఎంతో గుర్తింపు తెచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. మెతుకు సీమ వారసత్వ సంపదపై పరిశోధనలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్న బుర్ర సంతోష్ కృషిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్ నిరుడి దాసు, ఉప సర్పంచ్ ఎంపీ సుధాకర్, ఎంపీఓ రియాజుద్దీన్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ పద్మలత, సెక్టార్ సూపర్వైజర్ నిహారిక, ఏపీఎం గోపాల్, ఏపీఓ పౌలు, అర్చక సంఘ నాయకులు చంద్రశేఖర్ శర్మ, గిరిధర్ శర్మ, సంతోష్ కుమార్ శర్మ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు.







