సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్ నగర్ ఇటుక బట్టీల వద్ద అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్, శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్యలు ఒరిస్సాకు చెందిన వలస కార్మిక పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తుకు వారే పునాదులని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో చిన్నారుల పాత్ర కీలకమైనదన్నారు. భారత రాజ్యాంగంతో పాటు విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలైనా, ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా విద్యాభ్యాసం చేసే హక్కు వారికి ఉందని స్పష్టం చేశారు.

ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారు కోరారు. శనిగరం పరిధిలోని ఈ ప్రాంతంలో వలస పిల్లల కోసం ప్రత్యేకంగా పౌష్టికాహార పంపిణీ కేంద్రాలను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు స్థానిక సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య చొరవ చూపి, కృషి చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వలస సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ‘బాలల హక్కుల ప్రజా వేదిక’ గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) నిరంతరం శ్రమిస్తోందని నిర్వాహకులు గుర్తుచేశారు. బాలల హక్కుల రక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అలాగే బాల్య వివాహాల అడ్డుకట్ట కోసం తాము క్షేత్రస్థాయిలో నిరంతరం పోరాడుతున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు.