- గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు
- పార్టీలకు అతీతంగా మెదక్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి
- పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.. మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని వెల్లడి
మెదక్ (ప్రజా నేస్తం): మెదక్ నియోజకవర్గ పరిధిలోని ఆర్. వెంకటాపూర్ గ్రామ సమగ్రాభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు స్పష్టం చేశారు. సోమవారం రామాయంపేట మండల పరిధిలోని ఆర్. వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో భవన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు సర్పంచ్ ఉమా సంజీవరెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో గ్రామ అభివృద్ధిపై నాటి పాలకులు తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్. వెంకటాపూర్ గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఒక్క ఈ గ్రామానికే కాకుండా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలను రాజకీయాలకు అతీతంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం:
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలు, మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం వంటి అనేక ప్రజాహిత పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామంలో ఇప్పటికే చేపట్టిన పనులతో పాటు మిగిలిపోయిన అభివృద్ధి పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి మౌలిక వసతుల లోటు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఘనంగా హాజరైన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు:
ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారు మహేందర్‌రెడ్డి, రామాయంపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానేగళ్ల రామకృష్ణయ్య, సుతార్‌పల్లి సర్పంచ్ సునీల్, శివాయిపల్లి సర్పంచ్ రవి, ప్రగతి ధర్మారం సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, కాట్రియాల సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్గుప్తా, తునికిగండ్ల సర్పంచ్ మల్లన్నగారి శివకుమారి నాగులు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








