మెదక్, అక్టోబర్ 13: మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు సమీపంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

విగ్రహం సమీపంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని సీసీ కెమెరాల పనితీరును పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నేరాలు జరిగిన తర్వాత కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించడం కాకుండా ముందుగానే వాటి పనితీరును పరిశీలించాలని అన్నారు.







