నారాయణఖేడ్, అక్టోబర్ 12 : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని కోరారు. ఓటు హక్కు పవిత్రతను కాపాడటం, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటించడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు.

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.








