🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రోగుల పట్ల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆందోళన – వైద్యశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 22 Sep 2026 | ⏰ 04:32 PM

రంగారెడ్డి,సెప్టెంబర్ 22: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు.పేద,మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారం. అయితే ఆసుపత్రిలో మందుల లభ్యత, రోగులకు అందుతున్న వైద్య సేవల తీరుపై కొందరు రోగులు, వారి బంధువులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేకపోవడం, బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి రావడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని రోగులు చెబుతున్నారు. మరోవైపు 2024లో సరఫరా అయిన కొన్ని మందులు వాటి గడువు ముగియడానికి కేవలం కొద్దికాలం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బయటకు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మందుల నిల్వలు, సరఫరా తేదీలు, గడువు తేదీలు, పంపిణీ రికార్డులపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే రోగులకు అవసరమైన సమయంలో మందులు అందుబాటులో లేకపోతే.. వాటి నిల్వలు ఎప్పుడు వచ్చాయి? ఎంత పరిమాణంలో వచ్చాయి? ఎప్పుడు పంపిణీ చేశారు? గడువు తేదీలను సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మందులు రోగుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో గడువు తేదీని ప్రతి రోగి కూడా తప్పనిసరిగా పరిశీలించాలి.వైద్యులు, ఫార్మసీ సిబ్బంది కూడా మందులు అందించే సమయంలో గడువు తేదీ, నిల్వ పరిస్థితులను నిర్ధారించాల్సిన బాధ్యత ఉందని ప్రజలు గుర్తుచేస్తున్నారు.

మరోవైపు ఆసుపత్రికి వచ్చే రోగులను వైద్యులు, సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి ఓపికగా సమస్యను తెలుసుకుని, అవసరమైన పరీక్షలు చేసి, తగిన వైద్య సలహా ఇవ్వాల్సి ఉండగా.. తొందరపాటు సమాధానాలు, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని కొందరు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఎక్కడైనా చెప్పుకోండి” వంటి మాటలు రోగులకు సమాధానంగా వినిపిస్తే.. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువమంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు చెందినవారే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకంతో వారు ఇక్కడికి వస్తుంటారు.అలాంటి ప్రజలకు సమయానికి వైద్యం, అవసరమైన మందులు, గౌరవప్రదమైన వైద్య సేవలు అందడం అత్యంత అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా రోగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆసుపత్రి నిర్వహణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కేశంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల స్టాక్ రిజిస్టర్, మందులు వచ్చిన తేదీలు, బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు, పంపిణీ వివరాలను సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అదే విధంగా రోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మందుల విషయంలో అప్రమత్తత.. వైద్యంలో బాధ్యత.. రోగులతో మానవీయంగా వ్యవహరించడం — ఇవే ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే మార్గాలని స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్